30 కోట్లరూపాయలను అక్రమార్జన: కోనేరు ప్రసాద్
ఎమ్మార్ కుంభకోణంలో 30 కోట్లరూపాయలను అక్రమార్జన చేసినట్లు స్టైలిష్ హొం మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్ అంగీకరించారని సిబిఐ అధికారులు తెలిపారు. అక్రమంగా సంపాదించిన 30 కోట్ల రూపాయలను ఎక్కడ దాచారో చెప్పడంలేదని సిబిఐ అధికారులు ప్రత్యేకన్యాయస్థానానికి తెలిపారు. ఇదే విషయంపై కోనేరు గత రెండు రోజులుగా విచారణకు సహకరించడంలేదని ఆరోపించారు. ఈ డబ్బును వెలికి తీయడంతో పాటు ఎమ్మార్ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీని పొడిగించాలని సిబిఐ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించి ఈనెల 14వ తేదీ వరకు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సిబిఐ కస్టడీ భరించలేకపోతున్నాను సిబిఐ కస్టడీ భరించలేకపోతున్నానని, తనను శారీరకంగా హింసించకపోయినా సిబిఐ అధికారులు మానసికంగా
వేధిస్తున్నారని కోనేరు ప్రసాద్ ప్రత్యేక న్యాయస్థానంలో సిబిఐ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక ప్రశ్నను పదే పదే అడుగుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్ వ్యవహారంలో ఎలాంటి పాత్రలేని వారిపేర్లు ఉచ్చరిస్తూ కుంభకోణంలో వీరి హస్తం కూడా ఉందని ఒప్పుకోవాలంటూ సిబిఐ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిబిఐ అధికారులు తనను కస్టడీలోకి తీసుకుని దిల్‌కుషా అతిథి గృహంలో పెట్టారని, అయితే పగటిపూట విచారణ పేరిట గంటల తరబడి కూర్చోబెట్టి విరామం ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపణలు చేసినట్లు తెలిసింది. రాత్రి వేళల్లో కూడా దిల్‌కుషా అతిథి గృహంలో పెడుతున్న అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోణలు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తనకు పూజలు చేసుకునే అవకాశం కల్పించడం లేదన్నారు. రాత్రి వేళల్లో తనకు ప్రత్యేక గదిని కేటాయించాలని, పూజ చేసుకోవడానికి అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తున్న తనపై ఇంత వరకు ఎలాంటి మచ్చలేదని చెప్పినట్లు సమాచారం. ఎమ్మార్ వ్యవహారం పదేళ్ల క్రితం జరిగినందున వివరాలు వెల్లడించేందుకు తనకు గడువు కావాలని కోనేరు ప్రసాద్ కోర్టుకు విన్నవించకున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా కోనేరు ప్రసాద్‌కు ఈనెల 14 వరకు సిబిఐ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కోనేరు సిబిఐ కస్టడీ ముగియడంతో గురువారం ఉదయం దిల్‌కుషా అతిథి గృహం నుంచి సిబిఐ అధికారులు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు. సిబిఐ కోరిక మేరకు న్యాయస్థానం కోనేరు కస్టడీని పొడిగించింది. దీంతో పాటు కోనేరుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయడంతో పాటు అయ్యప్ప పూజ చేసుకునేందుకు అనుమతించాలని సిబిఐని ఆదేశించింది.