రెచ్చగొట్టే ప్రకటనల వల్లే ఘర్షణ
తెలంగాణ, సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్లే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని తెలంగాణ, ఆంధ్ర సద్భావనా సమావేశంలో కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ నగారా సమితి, టిఎస్‌ఎస్, ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని చల్లబరిచేందుకు అన్ని జిల్లాల్లో సద్భావనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గురువారం హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల నాయకులతో సద్భావనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి, కెకె, జి.వివేక్, టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, తెలంగాణ నగారా సమితి నేత కె.హరీశ్వర్‌రెడ్డి, విశాలాంధ్ర మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు పరకాల ప్రభాకర్, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ప్రజా సంఘాల రాష్ట్ర కన్వీనర్ గజ్జల కాంతం, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి నరసింహారావు, స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌బాపూజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారని చెప్పినట్లు తెలిసింది. దీనిపై ఎర్రబెల్లి స్పందిస్తూ సమైక్య రాష్ట్రం కోరుకునే పరిస్థితి ఒకప్పుడు ప్రజల్లో ఉండేదని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, లేకపోతే రాష్ట్రంలో మరింత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సద్భావనా సమావేశాలు నిర్వహించాలన్నారు. ముందుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కలిగే ప్రయోజనాలపై సురేందర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది.
22న జాతీయ ప్రతిపక్ష నాయకులకు విందు : కొండా లక్ష్మణ్
కేంద్రం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేయాలని స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్‌బాపూజీ డిమాండ్ చేశారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్లి ఆంధ్రా భవన్‌లో జాతీయ ప్రతిపక్ష నాయకులకు విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. 20న నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలంగాణ, ఆంధ్ర సద్భావనా సమావేశంలో పాల్గోనున్నట్లు చెప్పారు. 21న తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు సిఎం జయలలితను కలుస్తానన్నారు. 23న లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌లకు లేఖలు రాస్తానన్నారు. 24న ఇండియాగేట్ నుండి పార్లమెంటు వరకు స్వాతంత్య్ర సమరయోధులతో సత్యాగ్రహ యాత్ర చేపడుతామన్నారు. ఈ యాత్రలో తెలంగాణకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని కొండా లక్ష్మణ్ కోరారు.

