ఎమ్మల్యేలపై వైయస్ జగన్ ఒత్తిడి
తన నివాసంలో సమావేశమైన శాసనసభ్యులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రమైన ఒత్తిడి చేసినట్లు సమాచారం. తనకు అనుకూలంగా ప్రకటన చేయాలని ఆయన వారిపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. గుంటూరు ఓదార్పు యాత్రలో ఉన్న ఆయన పలు మార్లు సమావేశంలో ఉన్న శాసనసభ్యులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 8 గంటల పాటు శాసనసభ్యులు సమావేశమైన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఏం చేయాలనే విషయంపై చర్చించారు. ఈ సమావేశానికి మొత్తం 21 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. చివరి నిమిషంలో కుంజా సత్యవతి కూడా రావడంతో ఆ సంఖ్య 20 నుంచి 21 చేరుకుంది.
వైయస్ జగన్ ఒత్తిడి కారణంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి చిత్తశుద్ధికి ముడిపెడుతూ వారు ఓ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో అవిశ్వాసాన్ని ప్రతిపాదించాలని, అప్పుడే తాము మద్దతిస్తామని సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించినప్పుడు ఆలోచిద్దామని చాలా మంది శాసనసభ్యులు దాన్ని దాటవేసే ప్రయత్నాలు చేశారని అంటారు. కానీ జగన్ పట్టుబట్టడంతో సమావేశానంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ ప్రటన చేసినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితే కచ్చితంగా తేడాలు వస్తాయని ఆయన అన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు మాట మార్చారని ఆయన విమర్శించారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వ మనుగడకు ప్రమాదం వస్తుందని, అయితే, అవిశ్వాసం సమయంలో తెలుగుదేశం సభ్యులంతా సభలో ఉండేలా చంద్రబాబు చూసుకోవాలని ఆయన అన్నారు.