‘ఇందిరమ్మ’ కలలకు సాకారం
మహిళా స్వయం సంఘాలకు రుణాల పంపిణీలో జాప్యాన్ని నివారించి మూడంచెల వ్యవస్థకు బదులుగా ఇక నేరుగా ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లో రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వద్ద రూ. 353కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురం భీం సాగు నీటి ప్రాజెక్టును శనివారం ఆయన జాతికి అంకితం చేశారు. రచ్చబండ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేదరిక నిర్మూలన, మహిళల సాధికారత కోసం చేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పాటుపడ్డారని కొనియాడారు. ప్రభుత్వం మాట తప్పకుండా మహిళల సాధికారిత, ఆర్థిక స్వావలంభన కోసం రాజీలేకుండా కృషి చేస్తుందని సిఎం చెప్పారు. మహిళా గ్రూపులకు పావలా వడ్డీ రుణాల పంపిణీలో ప్రస్తుతం హైదరాబాద్ నుండి జిల్లా కేంద్రానికి, ఆతరువాత మండల స్థాయికి మూడంచెల వ్యవస్థ కారణంగా జాప్యం జరుగుతోందని, ఇకపై సెల్‌ఫోన్‌లో సమాచారం అందించిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లో రుణాలు జమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రబీలో పంట రుణాలు పొందే రైతులకు ఏడాది వరకు వడ్డీ లేకుండా రూ. లక్ష రుణ పరపతి కల్పించనున్నట్లు సిఎం స్పష్టం చేశారు. వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇక రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న 9 శాతం వడ్డీ రుణాలను 7 శాతానికి తగ్గించేలా వచ్చే బడ్జెట్‌లో ప్రవేశ పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 95లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేకూర్పు కల్పించేందుకు స్ర్తినిధి కింద రూ. 1000 కోట్లు కేటాయించి, ప్రతి మండల కేంద్రంలో స్ర్తినిధి బ్యాంకులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో 25లక్షల వ్యయంతో మండల సమాఖ్య భవనాలు నిర్మిస్తామని, ఇక అధికారాల పెత్తనం మహిళలకే కట్టబెడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్ట్ఫికెట్ల జారీలో, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మధ్య దళారుల దోపిడీని అరికట్టేందుకు పారదర్శక పద్దతితో ప్రభుత్వం ‘మీకోసం’ ఆన్‌లైన్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పిహెచ్‌సిలు, సర్కార్ ఆసుపత్రుల్లో డిసెంబర్ నెల నుండి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందిరమ్మ జయంతి రోజు గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రులు సుదర్శన్ రెడ్డి, ధర్మాన ప్రసాద్‌రావు, ఇంచార్జి మంత్రి బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
Posted by mahaandhra
on 1:19 PM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0