కాంగ్రెస్ జేబు సంస్థలా సిబిఐ
నిష్పాక్షికంగా నిలవాల్సిన సిబిఐ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థలా మారిందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. తనపై జరుగుతోన్న సిబిఐ విచారణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన లేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు కాంగ్రెస్ సిబిఐని వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటన కోసం ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలోను, సిపిఐ జాతీయ కార్యాలయంలోనూ మీడియాతో మాట్లాడారు. సిబిఐ స్వయం ప్రతిపత్తితో, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాము మొదటి నుండీ చెబుతున్నామన్నారు. ' విచారణలు నాకు కొత్త కాదు. గతంలోనే 23 విచారణలు, 25 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎదుర్కున్నా. ఆ ఆరోపణలన్నింటినీ కోర్టులు కొట్టేశాయి. ఇప్పుడు కూడా నాపై బురదజల్లడానికే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఏ విచారణకైనా సిద్ధం. సిబిఐ విచారణను వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా నాకు లేదు ..' అని ఈ సందర్భంగా చంద్రబాబు ఆవేశంగా అన్నారు. వ్యవసాయ సంక్షోభంపై చర్చ జాతీయ అజెండాగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే సోమవారం ఢిల్లీలో జాతీయ రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభానికి తాజాగా కరవు తోడవ్వడంతో, రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యిందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సిపిఐ జాతీయ కార్యదర్శి ఎబి బర్దన్, జెడి(యు) అధ్యక్షుడు శరద్‌యాదవ్‌తో ఆదివారం సాయంత్రం ఆయన సమావేశమయ్యారు. తాను చేపట్టిన రైతు పాదయాత్ర విశేషాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తనపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వుల నేపథ్యాన్నీ తెలిపారు. బాబుతో భేటీ అనంతరం బర్దన్ మాట్లాడుతూ..' గతంలో ములాయంసింగ్ యాదవ్‌తో పాటు పలువురిపై సిబిఐని కాంగ్రెస్ అస్త్రంగా వినియోగించింది. చంద్రబాబుపై విచారణలో ఆశ్చర్యమేమీ లేదు..' అని వ్యాఖ్యానించారు.
నేడు రౌండ్‌టేబుల్
దేశంలో వ్యవసాయ సంక్షోభంపై చర్చించడం కోసం వామపక్షాలతో పాటు పలు పార్టీలు సోమవారమిక్కడ సమావేశమ వ్వనున్నాయి. ఇక్కడి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఉదయం 11 గంటల నుండి ఒకటిన్నర వరకూ రౌండ్ టేబుల్ సమావేశం
జరగనుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్, సిపిఐ కార్యదర్శి ఎబి బర్దన్, టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్, జెడి(ఎస్), బిజెడి, ఆర్‌ఎల్‌డి తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని టిడిపి శ్రేణులు వెల్లడించాయి.

