పదవులు వదులుకుని.. విచారణ ఎదుర్కోండి
టిడిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రెండు పదవులకు రాజీనామా చేసి హైకోర్టు ఆదేశించిన సిబిఐ విచారణను ఎదుర్కొని సచ్ఛీలతను నిరూపించుకోవాలని సిఎల్‌పి డిమాండ్ చేసింది. గురువారం ఇక్కడ సిఎల్‌పిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ హైకోర్టు విధించిన మూడు నెలల కాలంలో పార్టీ అధ్యక్ష పదవిని, ప్రతిపక్ష నేత పదవులను బిసి, ఎస్సీ వర్గాలు లేదా తనకు నచ్చిన వారికి అప్పగించి విచారణకు సహకరించాలని కోరారు. చంద్రబాబు విచారణను ఎదుర్కొనే దమ్ములేక, కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కయినట్లు నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తిలేదన్నారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్రప్రజలకు తెలుసని అందుకే రెండుసార్లు ఓడించారన్నారు. గతంలో అభియోగాలపై కోర్టు ఆదేశిస్తే పై కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు ఇక డ్రామాలను కట్టిపెట్టి సిబిఐ విచారణకు సహకరించాలన్నారు. చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయడం వెనుక కాంగ్రెస్ హస్తముందనే ఆరోపణలతో కాలక్షేపం చేయడం తగదన్నారు. ఇంతకాలం తాను సత్యహరిశ్చంద్రుడి తమ్ముడనో, అన్నాహజారేకి బాగా కావాల్సిన వారనో కబుర్లు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఏదోవిధంగా వెళ్లి స్టే తెచ్చుకునేందుకు సమాయత్తమవుతున్నారన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకూడా చంద్రబాబు అవినీతి గురించి ప్రముఖంగా ప్రస్తావించారన్నారు. తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా,తన అనుచరులతో కాంగ్రెస్, జగన్ కుమ్మక్కయినట్లు ఉత్తుత్తి పసలేని ప్రకటనలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఈ వివాదాల్లోకి కాంగ్రెస్‌ను లాగే ప్రయత్నం చేస్తే ఊరుకోమన్నారు. కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కిరణ్‌కుకుమార్ రెడ్డి ప్రభుత్వం అవినీతి రహితంగా, స్వచ్చమైన పాలనను అందిస్తున్నాయన్నారు.

