Categories

Popular Posts

Blog Archive

సీబీఐ, ఎల్లోమీడియా కుమ్మక్కయ్యాయా?: జూపూడి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు ఆందోళన వ్యక్తంచేశారు. అసలు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిందేమిటి? దర్యాప్తు చేస్తున్న తీరు ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా లబ్ధి పొందిన వారు సాక్షిలో పెట్టుబడులు పెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కానీ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారా? అయితే ప్రభుత్వంలో ఉన్న మంత్రులను విచారించారా? సచివాలయానికి వెళ్లి అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారా? అధికారులను ప్రశ్నించారా?’’ అని జూపూడి సూటిగా ప్రశ్నించారు.

ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌తో వ్యాపార స్పర్థగల పత్రికలకు సీబీఐ ముందుగానే దర్యాప్తు తీరుతెన్నులను లీక్ చేస్తోందంటే దీనర్థం ఏమిటి? తప్పులేమీ లేకున్నా జగన్‌ను అప్రతిష్టపాలుచేయాలన్న ఉద్దేశంతో కాదా! అని ప్రశ్నిం చారు. అసలు సీబీఐ అధికారులు ఎల్లో మీడియాతో కలిసి టీలు తాగి అన్ని విషయాలూ వారికి చెబుతున్నారా? వారితో విందులు భోంచే స్తూ జగన్‌కు వ్యతిరేకంగా వార్తలందిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సీబీఐ, రా, విజిలెన్స్ వంటి విభాగాలకు విశ్వసనీయత ఉందని, అలాంటి సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించొద్దని జూపూడి హితవు పలికారు. ఎల్లో మీడియా ద్వారా సీబీఐ ప్రతి రోజూ జగన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న అసత్య ప్రచారానికి తెరదించాలని, లేని పక్షంలో ఆ సంస్థ తీరును అనుమానించాల్సి ఉంటుందన్నారు.

విజయసాయిరెడ్డికి అవకాశమివ్వండి
జగతి పబ్లికేషన్స్ విలువ పెంచాల్సిందిగా ‘డెలాయిట్’పై తాను ఒత్తిడి చేశానని వచ్చిన ఆరోపణల్లో నిజాల నిగ్గు తేల్చే అవకాశమివ్వాలంటూ ఆ సంస్థ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించాలని జూపూడి డిమాండ్ చేశారు. డెలాయిట్ సంస్థ డెరైక్టర్ సుదర్శన్‌తో విజయసాయిరెడ్డి ముఖాముఖి మాట్లాడ్డానికి అవకాశం కల్పించాలని కోరారు. డెలాయిట్‌లాంటి అంతర్జాతీయ ప్రమాణాలుగల సంస్థపై ఒక క్లయింట్ ఒత్తిడి తేవడం సాధ్యమేనా? వాస్తవాలు వెల్లడయ్యేందుకే సుదర్శన్, విజయసాయిరెడ్డిని ఒకే చోట చేర్చి మాట్లాడాలని సీబీఐని కోరుతున్నామని అన్నారు.

మీకైతే ఒప్పు.. సాక్షికైతే తప్పా?
తన సంస్థలు కోట్ల రూపాయల నష్టంతో ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ, రిజర్వు బ్యాంకులకు స్వయంగా ప్రకటించిన రామోజీరావు తన షేరు విలువను 5.3 లక్షలకు ఎలా అమ్మగలిగారు? అదే సాక్షిలోకి పెట్టుబడులు వస్తే ఎలా తప్పు బడతారు? అని జూపూడి ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఈనాడు ఒక ‘స్క్రాప్...(తుక్కు)’ దాని తోక పత్రిక ఓ ‘సిక్ ఇండస్ట్రీ’ (మూతపడ్డ పరిశ్రమ), మరి ఈ రెండింట్లోకీ వేలాది కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పాత సాంకేతిక పరిజ్ఞానం, పాత ముద్రణా యంత్రాలుగల ఈ ‘స్క్రాప్.. సిక్’ పత్రికల్లోకే వేలాది కోట్లు వచ్చినపుడు అత్యంత అధునాతన యంత్రాలతో రంగుల ముద్రణతో మార్కెట్‌లోకి వచ్చిన సాక్షికి పెట్టుబడిదారులు ఎందుకు నిధులివ్వరని అన్నారు.

మూడు ‘సీ’ల కుట్ర
రాష్ట్రంలో ఉన్న మూడు ‘సీ’లు- కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు, చిరంజీవి- కలిసి కుట్ర పన్ని జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని జూపూడి ఆరోపించారు. ప్రజల్లో జగన్‌పై నానాటికీ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వ లేక, ప్రజాక్షేత్రంలో ఆయనను ఎదుర్కోలేక ఎల్లో మీడియా, చంద్రబాబు, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

Posted by mahaandhra on 9:33 AM. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for సీబీఐ, ఎల్లోమీడియా కుమ్మక్కయ్యాయా?: జూపూడి

Leave comment

Photo Gallery