క్లీన్ స్వీప్ భారత్ లక్ష్యం
మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో గణనీయ విజయాలతో సీరీస్‌ను హస్తగతం చేసుకున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం ముంబయి వాంఖెడే స్టేడియంలో ప్రారంభం కానున్న మూడవ, ఆఖరి టెస్ట్‌లో గెలిచి వెస్టిండీస్‌పై క్లీన్ స్వీప్ సాధించడాన్ని లక్ష్యం చేసుకోబోతున్నది. కాగా అందరి కళ్లూ నూరవ అంతర్జాతీయ శతకానికి ఒకటి చేరువలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పైనే కేంద్రీకృతం కాగలవు. మొదటి రెండు టెస్ట్‌లలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన టెండూల్కర్ సొంత గడ్డపై ఆ మైలురాయిని అందుకోవాలనే పట్టుదలతో ఉండవచ్చు. మార్చి 12న నాగపూర్‌లో దక్షిణాఫ్రికాపై ప్రపంచ కప్ లీగ్‌లో తన 99వ అంతర్జాతీయ సెంచరీని స్కోర్ చేసిన తరువాత బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ ఆ మైలురాయిని చేరుకోవడానికి నిరీక్షిస్తున్నాడు.
కాగా, నామామాత్రావశిష్ఠంగా మారిన మూడవ చివరి టెస్ట్‌లో గెలిచి, రానున్న వన్-డే సీరీస్‌కు ముందుగా నైతిక స్థైర్యం పెంచుకోవాలని వెస్టిండీస్ జట్టు కాంక్షిస్తున్నట్లయితే, వారు అన్ని విభాగాలలోను తమ సత్తా చూపవలసిన అవసరం ఉంటుంది. సంయమనం ప్రదర్శించి, దృఢచిత్తంతో విండీస్ జట్టు ఆడితే ఏవిధంగా ప్రతిఘటించగలదో కోలకతాలో రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ సూచించింది. వారు ఇన్నింగ్స్ ఓటమిని దాదాపుగా తప్పించుకున్నారు. సై్వర విహారం చేస్తున్న భారత స్పిన్నర్ల ద్వయం ప్రజ్ఞాన్ ఓఝా, రవిచంద్రన్ అశ్విన్‌లను డారెన్ బ్రావో, మర్లన్ శామ్యూల్స్ దీటుగా ఎదుర్కొని బ్యాట్ చేసిన తీరు ఆ జట్టులో మూడవ టెస్ట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.