ఎవరీ కిషన్‌జీ, ఇక్కడి నుంచి ఎక్కడి దాకా నడక?
మూడు దశాబ్దాల పాటు నక్సలైట్ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు హతమైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. కిషన్‌జీ సహా నలుగురు ఎదురుకాల్పుల్లో మరణించారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. కేంద్రం విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో కిషన్‌జీ మూడో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల కోటేశ్వర రావు రైతుకూలీ సంఘంలో ప్రధాన పాత్ర పోషించాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల జైత్ర యాత్రలో కూడా ఆయనది ప్రధానమైన పాత్ర. అప్పటి పీపుల్స్ వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లోజుల కోటేశ్వర రావు క్రమంగా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో గత సిపిఎం ప్రభుత్వానికి పక్కలో బెల్లంగా వ్యవహరించాడు.
కిషన్‌జీ సోదరుడు మల్లోజుల కోటేశ్వర రావు కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఆయన ఛత్తీస్‌ఘడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 1980 దశకంలో ప్రహ్లాద్ పేరుతో కిషన్‌జీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నిర్వహించారు. కిషన్‌జీ మరణవార్త వినగానే పెద్దపల్లిలోని ఆయన అన్న ఆంజనేయులు కుప్పకూలిపోయారు. ఆయన బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. మరణవార్తను తల్లి మదనమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తన మూడు దశాబ్దాల నక్సలైట్ ఉద్యమంలో ఆయన శ్రీధర్, తదితర పలు మారు పేర్లతో పనిచేశారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా, బీహార్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కిషన్‌జీ కోసం గత నాలుగు రోజులుగా సంయుక్త బలగాలు జంగల్ మహల్‌ను జల్లెడ పడుతూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఆయన స్థావరాన్ని చుట్టుముట్టారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఖుష్బనీ అడవుల్లో కిషన్‌జీని హతమయ్యారు. ప్రస్తుతం ఆయనకు 62 ఏళ్లు. కిషన్‌జీ సంచలనాలకు మారు పేరుగా ఉన్నారు. ఆయన ఓ బడి పంతులు కుమారుడు. అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య అప్పటి ముఖ్య నేతలు కెజి సత్యమూర్తి అలియాస్ శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి, ఐవి సాంబశివరావులను పక్కన పెట్టి 1980లో మల్లోజులు కోటేశ్వర రావుకు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ప్రహ్లాద్ పేరుతో ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1987లో దండకారణ్యానికి మకాం మార్చారు.

