రైతు కమిటీకి బాబు కన్వీనర్
దేశవ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి, వారి సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో పోరాడేందుకు జాతీయ రైతు సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి కన్వీనర్‌గా టీడీపీ అధినేత చంద్రబాబును ఎంపిక చేసినట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ ప్రకటించారు. దేశంలో రైతు సమస్యలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు సోమవారం స్థానిక కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ రాజకీయ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
చంద్రబాబు ఆధ్వర్యంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, జేడీ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా, ఫార్వర్డ్‌బ్లాక్ నాయకుడు దేవబ్రత బిస్వాస్, జేడీ (ఎస్) ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ, భారత రైతుసంఘాల సమా ఖ్య అధ్యక్షుడు సత్నామ్‌సింగ్, ప్రధాన కార్యదర్శి చెంగల్‌రెడ్డి, టీడీపీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు, రాజ్యసభా పక్ష నాయకుడు మైసూరారెడ్డి తదితరులు ఈ సమావేశంలో మాట్లాడారు.
దేశంలో రైతులంతా ఏకమై తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కమిటీ అభిప్రాయపడింది. సమావేశంలో కమిటీకి ఢిల్లీలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి, సహచర పార్టీలు, రైతు సంఘాలను కమిటీలో చేర్చుకోవాలి. రైతు సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి. రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. స్వామినాథన్ కమిటీ నివేదికను ఆమోదించాలి.. తదితర తీర్మానాలను చేశారు.

