ఒంగోలులో వైఎస్‌ఆర్, కాంగ్రెస్ గ్రూపుల ఘర్షణ
విజయవాడ, ఒంగోలు, విశాఖ జిల్లాల్లో శుక్రవారం జరిగిన రచ్చబండ సభల్లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. విజయవాడ రచ్చబండలో సమస్యలపై ప్రశ్నించిన సిపిఎం నాయకులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్.బాబూరావును సుమారు 40 మంది పోలీసులు చుట్టుముట్టి లాక్కెళ్లారు. మహిళలపై పిడిగుద్దులు గుద్దారు. ఒంగోలులో వైఎస్ ఫొటో లేదని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి, బాలినేని గ్రూపుల మధ్య గొడవ జరిగింది. దీంతో బాలినేనిని అరెస్టు చేశారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం జంగిడివలస గిరిజనుల ఇళ్ల స్థలాల సమస్యపై రచ్చబండను అడ్డుకుంటామని ప్రకటించిన సిపిఎం మండల కార్యదర్శి కిల్లో దయానిధిని ముందస్తుగా అరెస్టు చేశారు. విజయవాడ 55వ డివిజన్ రచ్చబండ సభలో 'ఎఎస్‌ఓగారూ, తెల్లకార్డువాళ్లకు 30 కిలోల బియ్యం ఇస్తామన్నారు. ఇంతవరకూ ఇవ్వలేదు' అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్.బాబూరావు సమస్యను చెబుతుండగానే సుమారు 40 మంది పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. తాను స్థానిక మాజీ కార్పొరేటర్‌ననీ, ఎందుకు మాట్లాడనివ్వడం లేదనీ ప్రశ్నిస్తుండగానే సెంట్రల్ ఎసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో అప్పటికే రోప్‌పార్టీతో సిద్ధమైన కానిస్టేబుళ్లు లాక్కెళ్లిపోయారు.
అడ్డుకోబోయిన స్థానిక నాయకులు రమణ తదితరులను పక్కకు నెట్టేశారు. కాళ్లుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన ఆటోలో ఎత్తిపడేశారు. మహిళలు తమ సమస్యలు చెబుతుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంట తిరిగే కొద్దిమంది స్థానిక రౌడీషీటర్లు బెదిరింపులకు దిగారు. నోరెత్తితే అరెస్టు చేయిస్తామంటూ భయబ్రాంతులకు గురిచేశారు. మహిళలను పోలీసులు పిడిగుద్దులు గుద్దారు. టాస్క్‌ఫోర్సు కానిస్టేబుళ్లయితే నాయకులపై దౌర్జన్యం ప్రదర్శించారు. అరెస్టును నిరసిస్తూ సిపిఎం నాయకులు రచ్చబండ జరుగుతున్న షాదీఖానా ప్రధానగేటు ముందు ధర్నాకు దిగారు. వారినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సిఐలు, 12 మంది ఎస్‌ఐలు, రోప్‌పార్టీ, టాస్కుఫోర్సు పోలీసులు సుమారు 200 మంది మోహరించారు. బాబూరావును, ఇతర నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ముందుగానే వ్యూహర రచించారు. ఇందులో భాగంగా రచ్చబండ వేదిక వెనుకవైపు ప్రహరీగోడను పగులకొట్టించారు. అది తెలియకుండా ఉండేందుకు తడికలు అడ్డం పెట్టారు. బాబూరావును అరెస్టు చేస్తుండగానే మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లి తడికలు లాగేసి ఆటోలను సిద్ధం చేశారు. నాయకులను క్షణాల్లో అక్కడ నుండి తరలించారు. దీనికోసం నాలుగు రోజుల నుండి ఇంటిలిజెన్స్ పోలీసులు అక్కడే ఉండి పనులు చక్కబెట్టారు.
అరెస్టు చేసిన నాయకులను పటమట పోలీసుస్టేషన్‌కు తరలించారు. తమను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ నాయకులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సిపిఎం నగర కార్యదర్శి ఆర్.రఘు తదితరులు అక్కడకు చేరుకుని పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్‌గా బాబూరావు సమస్యలు లేవనెత్తుతుంటే తట్టుకోలేక అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. అనంతరం నాయకులను, కార్యకర్తలను విడిచిపెట్టారు.
Posted by mahaandhra
on 10:57 AM.
Filed under
feature,
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0