పవన్ వ్యాఖ్యలు: డ్యామేజీ కంట్రోల్‌లో చిరంజీవి ఫ్యామిలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వాడి కాంగ్రెసు శాసనసభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి రెండు రోజుల తర్వాత గానీ తాకినట్లు లేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మీడియా వరుస కథనాలను ప్రసారం చేస్తుండడంతో చిరంజీవి కుటుంబానికి నష్టనివారణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావం చిరంజీవి రాజకీయ జీవితంపై కూడా పడే ప్రమాదం వాటిల్లిందని అంటారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని, అందుకే చిరంజీవికి దూరమయ్యారని ప్రచారం జోరందుకుంది. తనకు వారసత్వంపై నమ్మకం లేదని, చిరంజీవి తమ్ముడిగా నిలబడాలని తాను అనుకోవడం లేదని, అభిమానులు చిరంజీవి తమ్ముడిగా తనను చూడవద్దని, తనను తానుగానే చూడాలని పంజా సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో అన్నారు. ఆ వ్యాఖ్యలు చిరంజీవి కుటుంబాన్ని వివాదంలో పడేశాయి.
పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు కాదంటూ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు అరవింద్ ప్రకటన ఇచ్చారు. తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తాను షూటింగు నుంచి ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమానికి వెళ్లలేకపోయారని, రామ్ చరణ్ తేజ్ చైనాలో షూటింగులో ఉన్నారని, చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని ఆయన చెప్పారు. గురువారంనాడు తాజాగా చిరంజీవి గొంతు విప్పారు. మీడియా వార్తలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, ఫంక్షన్‌కు హాజరు కాకపోయినంత మాత్రాన దూరమైనట్లు కాదని, తాను చాలా ఫంక్షన్లకు వెళ్లలేదని ఆయన అన్నారు. వారసత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన అభినందించారు.
మొత్తం మీద, లోపల ఏం జరుగుతోందో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమైన ఒకటి తర్వాత మరొకటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. బయటకు కనిపించేదే వాస్తవంగా ప్రచారంలోకి వస్తుంది. తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్‌కు, చిరంజీవి కుటుంబానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలను మాత్రం దుమారం రేపుతున్నాయి.

