అశ్విన్ సెంచరీ
యువ స్పిన్నర్, కొత్త పెళ్లికొడుకు రవిచంద్రన్ అశ్విన్ అద్భుత సెంచరీతో భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి తప్పించడం, కెరీర్‌లో వందో సెంచరీని సచిన్ తెండూల్కర్ కేవలం ఆరు పరుగుల తేడాతో చేజార్చుకోవడం వెస్టిండీస్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి, మూడో టెస్టు మ్యాచ్ నాలుగోరోజు ఆట ప్రధానాంశాలు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 590 పరుగుల భారీ స్కోరు సాధించగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మ్యాచ్ మూడోరోజు, గురువారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 281 పరుగులు చేసింది. అప్పటికి సచిన్ 67, వివిఎస్ లక్ష్మణ్ 32 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన భారత్ మొదటి బంతికే లక్ష్మణ్ వికెట్‌ను కోల్పోయింది. ఫిడెల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో మార్లొన్ సామ్యూల్స్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో లక్ష్మణ్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ, సచిన్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. కెరీర్‌లో అంతర్జాతీయ ‘సెంచరీల సెంచరీ’ పూర్తి చేసే ఊపుమీద కనిపించిన సచిన్ దురదృష్టవశాత్తు ఆరు పరుగుల తేడాతో ఆ మైలురాయిని దాటలేకపోయాడు. రవి రాంపాల్ వేసిన బంతిని స్క్వేర్ కట్‌తో బౌండరీకి తరలించే ప్రయత్నంలో సెకండ్ స్లిప్స్‌లో కాపుకాసిన విండీస్ కెప్టెన్ డారెన్ సమీ చేతికి క్యాచ్ అందించి వెనుదిరిగాడు. అతను మొత్తం 219 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి, 153 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుట్‌కాగా, ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశ చెందారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, ఎనిమిది పరుగులు చేసి సమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 331 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ తప్ప చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవరూ కనిపించకపోవడంతో, టీమిండియాకు ఫాలోఆన్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, విరాట్ కోహ్లీతో జత కలిసిన అశ్విన్ అసాధారణ పోరాటాన్ని కొనసాగించాడు. కెరీర్‌లో తొలి టెస్టు అర్ధ సెంచరీ చేసిన కోహ్లీ జట్టు స్కోరు 428 పరుగుల వద్ద దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో ఫిడెల్ ఎడ్వర్డ్స్‌కు దొరికిపోయాడు. కాగా, వనే్డల తరహాలో ఆడిన అశ్విన్ జట్టును ఆదుకున్నాడు. ఇశాంత్ శర్మ (5), వరుణ్ ఆరోన్ (4) వెంటవెంటనే అవుటైనప్పటికీ, అశ్విన్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మొత్తం మీద అతను 118 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు సాధించి, రంపాల్ బౌలింగ్‌లో అడ్రియన్ బరత్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. భారత్ ఇన్నింగ్స్‌కు 482 పరుగుల వద్ద తెరపడింది. అశ్విన్‌కు గొప్పగా మద్దతిచ్చిన ప్రజ్ఞాన్ ఓఝా పరుగుల ఖాతా తెరవకపోయినా, 14 బంతులు ఎదుర్కొని నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, సామ్యూల్స్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. సమీకి రెండు వికెట్లు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 81 పరుగులు చేసింది. బరత్ 3, కిర్క్ ఎడ్వర్డ్స్ 17 పరుగులు చేసి ప్రజ్ఞాన్ ఓఝా బౌలింగ్‌లో అవుటయ్యారు. బ్రాత్‌వెయిట్ 34, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో డారెన్ బ్రేవో 27 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. శనివారం చివరి రోజు కావడంతో, ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపిస్తున్నది
Posted by mahaandhra
on 10:55 AM.
Filed under
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0