విచారణ ప్రారంభం

2జి స్పెక్ట్రమ్ కేసులో విచారణ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కేసులో టెలికం మాజీ మంత్రి ఎ రాజా, డిఎంకె అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సహా 14 మంది నేరపూరిత కుట్ర సహా పలు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. కేసు విచారణకు రాజా, కనిమొళి హాజరయ్యారు. ఈ కేసులో సిబిఐ ప్రవేశపెట్టిన సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయరాదంటూ ప్రధాన నిందితుడైన టెలికాం మాజీ మంత్రి కోర్టుకు విన్నవించారు. 2009 అక్టోబరు 21న ప్రారంభమైన కేసు దర్యాప్తు ముగిసిందని, నేరశిక్షా స్మృతి సెక్షన్ 244 నిర్దేశించిన ప్రకారం కేసుకు సంబంధించిన వాంగ్మూలాలను నమోదు చేయడం జరిగిందని కోర్టుకు దాఖలు చేసిన దరఖాస్తులో రాజా పేర్కొన్నారు. రాజా తరపు న్యాయవాది సుశీల్‌కుమార్ మాట్లాడుతూ లూప్ టెలికాంపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం కోర్టుకు సిబిఐ తెలియజేసిన సమాచారాన్ని ప్రస్తావించారు. కేసులోని నిందితులకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు ముగిసిందో లేదో సిబిఐని ప్రశ్నించి నిర్ధారించుకోవాలని సుశీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
సిబిఐ దర్యాప్తు ముగిసిందని, సాక్షుల వాంగ్మూలాలన్నీ తనకు అందచేసిందని, కాబట్టి సాక్షులను పిలిపించి క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారం తనకుందని, అప్పటివరకు తన పరోక్షంలో కోర్టు విచారణ జరుపుకోవచ్చని పేర్కొంటూ రాజా దాఖలు చేసిన దరఖాస్తును న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ విచారణ ప్రారంభిస్తూ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షి రిలయన్స్ కేపిటల్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు ఆనంద సుబ్రమణ్యం వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ నెలలో సిబిఐ 28 మంది సాక్షుల జాబితా తయారుచేసింది. వారిలో 11 మంది రిలయన్స్ అనిల్ ధీరూభారు అంబానీ గ్రూపు (అడాగ్)నకు చెందిన వారున్నారు. శుక్రవారం ప్రశ్నించాల్సినవారిలో అడాగ్ అధ్యక్షుడు ఎఎన్ సేతురామన్, ఎతిసలాత్ డిబి చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ వినోద్ కుమార్ బుద్ధిరాజ ఉన్నారు.

Posted by mahaandhra
on 10:41 AM.
Filed under
HighLights,
News
.
You can follow any responses to this entry through the
RSS 2.0