ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో తిప్పలు తప్పవంటున్నారు
రాజకీయంగా కేవీపీ, కేసీఆర్ మాత్రమే కాకుండా కొందరు అధికారులకూ కోర్టు తిప్పలు తప్పవంటున్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో అప్పటి మైనింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్ ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొని అరెస్టయ్యారు. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సైతం రేపో మాపో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజగోపాల్‌తో పాటు శ్రీలక్ష్మి తన అధికారాన్ని ఉపయోగించి గాలి జనార్దనరెడ్డికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ప్రస్తుతం మరో రాష్ట్రంలో పని చేస్తున్న ఎంజీకే భాను పేరు సైతం వినిపిస్తున్నది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్య కార్యదర్శిగా పని చేసిన భాను ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్ద స్థాయిలో చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి.తాజాగా ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది. ఎల్లుండి ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఆయన ఆస్తులపై ఇంతవరకూ విచారణ జరగలేదు. మరో ఐఏఎస్ అధికారి రత్నప్రభ గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక మండళ్ళ (ఎస్‌ఇజడ్‌లు) వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చారన్న ఆరోపణలు చాలాకాలం నుంచి కొనసాగుతు న్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా, పరిశ్ర మల శాఖ కార్యదర్శిగా ఉన్న బీపీ ఆచార్యపై సైతం పలు ఆరోపణలు వెల్లువ ెత్తాయి. ఆయన ఎమ్మార్ కేసులో ఇప్పటికే ఏ-1గా ఉన్నారు. జగన్, బాబు వంటి రాజకీయనాయకుల ఆస్తులపై విచారణకు ఆదేశించిన మాదిరిగానే... ఎవరైనా ఈ అధికారుల ఆస్తులపైనా విచారణ జరపాలని కోర్టు మెట్లు ఎక్కితే ఆస్తుల బండారం బయటపడక తప్పదంటున్నారు. ప్రస్తుతం సీబీఐ వారి హయాంలో జరిగిన వ్యవహారాలపైనే విచారిస్తోంది. భవిష్యత్తులో వారి ఆస్తుల పైనా విచారణకు ఆదేశించాలని కోర్టుకెక్కితే కష్టాలు తప్పవంటున్నారు.