జారిపోయేవారిని పట్టుకోలేమన్న జగన్
నా వద్దకు రావాలని ఎవరికీ ఫోన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీని వదలమని ఎవరినీ కోరలేదు. పార్టీలోకి వచ్చినవారు నన్ను అడిగి రాలేదు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయమని నేను చెప్పలేదు. వారికి వారుగా వచ్చారు. అనుకుని రాజీనామా చేశారు. ఎందుకొచ్చారో తెలియదు. ఎందుకు పోవడానికి సిద్ధమయ్యారో నన్ను అడగొద్దు. పోతున్నవారిని పట్టుకుని అడగను. ఏమీ జరగకపోయినా ఇప్పటికే ప్రలోభాలకు గురిచేశామని ప్రచారం జరిగింది. ఒక్కొక్కరికి ఐదేసి కోట్లు ఇస్తామని చెప్పాలా.. అటువైపు ప్రభుత్వం కూడా పదేసి కోట్లు ఇస్తామని చెబుతుంది. దీనికి అంతం ఉండదు. ఇష్టం ఉంటే పార్టీలో ఉంటారు. పట్టుకుంటే నిలబడతారనుకోవడం పొరపాటు' అని పార్టీ ముఖ్య నేతలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. జగన్‌కు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది జారుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ కోసం కడదాకా ఉంటామన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. రాజీనామా చేసిన 26 మంది ఎమ్మెల్యేల్లో 19 మంది తమ రాజీనామాలను ఆమోదించొద్దని స్పీకర్‌ను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయటకు వెళ్ళినవారంతా వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతుంటే కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని ఖండించారు. అయినా ఇటీవల వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో వరుసగా ఏలూరు, కాకినాడ ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని వారు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన రచ్చబండలో ఆళ్ళ నాని పాల్గొని సిఎంను పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సిఎంను కలిశారు. వారిద్దరూ జగన్‌కు గట్టి మద్దతుదారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే సిఎంను కలిశానని ద్వారంపూడి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రిని కలవడంలో తప్పేముందని, ప్రతి విషయాన్ని భూతద్ధంలో చూడొద్దని అన్నారు. కాంగ్రెస్‌ను వీడినవారంతా తిరిగొస్తారని, జగన్‌కు కూడా వస్తారేమోనని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన వారు ప్రభుత్వాన్ని కాపాడుకుంటారని మంత్రి శైలజానాథ్ అన్నారు.
జగన్ ఆస్తులపై సిబిఐ రూపొందించిన నివేదికలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ఉండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. వారిలో కొండా సురేఖ, సత్యవతి ప్రత్యేక తెలంగాణా కోరుతూ రాజీనామాలు సమర్పించారు. జగన్‌కు మద్దతిస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని ప్రకటించి సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ మొదట్లోనే జగన్ శిబిరంలో కలకలం సృష్టించారు. రాజీనామాల ఆమోదం కోసం తరువాత స్పీకర్‌ను కలిసే ప్రయత్నం చేయగా ఆనాడే కొంతమంది వెనకడుగు వేశారు. ఇటీవల ఓఎంసీ గనుల కేసులో సిబిఐ విచారణలో జగన్ పాల్గొనడం, ఈడీ సమన్లు ఇవ్వడం, జగన్ అరెస్టు అవుతారన్న వార్తలు రావడంతో ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. సిబిఐ విచారణకు హాజరు సమయంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ హైదరాబాద్ రాలేదు. జగన్‌కు మొదట్నుండి మద్దతు ఇస్తూ వస్తున్న ధర్మాన కృష్ణదాస్, కొండా సురేఖ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వంటి నేతలు జగన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలిసింది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తమకెందుకులే అన్నట్లు ఉన్నారని తెలిసింది. రాజీనామాల ఆమోదంపై ప్రక్రియను స్పీకర్ వేగవంతం చేయడంతో ఎమ్మెల్యేల్లో భయం పెరిగింది. 26 మంది ఎమ్మెల్యేల్లో 19 మంది రాజీనామాలను ఆమోదించొద్దని స్పీకర్‌ను కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ సహా ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ, సీనియర్ నేతలు రఘవీరారెడ్డి, జేసి దివాకర్‌రెడ్డి వంటి నేతలు మాట్లాడుతూ వెళ్ళిన వారంతా పార్టీలోకి వస్తున్నారని, ఇప్పటికే సగం మంది ముఖ్యమంత్రిని కలిశారని చెప్పారు. నేతలు వెళ్ళడం పట్ల జగన్ వద్ద నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదో ఒకటి చేయకుంటే పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైన భావన వస్తుందని, ఎమ్మెల్యేలకు ఏమీ కాదని భరోసా ఇవ్వాలని సీనియర్ నేతలు చెప్పగా వారిపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. వారిని ఉండాలని తాను కోరబోనని, ఉండాలనుకున్నవాళ్ళు ఉంటారని తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలకు సంబంధించిన పనులకు కత్తెర వేయడం, నియోజకవర్గ పనులను ప్రభుత్వం ఆపివేయడంతో వారంతా భయపడి కాంగ్రెస్‌లోకి వెళుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ వైపు వెళ్ళినప్పుడు వారు ప్రలోభాలకు గురిచేశామని ఒప్పుకుంటే తమవైపు రావడానికి తామూ ప్రలోభాలకు గురి చేశామని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఉంటుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
Posted by mahaandhra
on 10:41 AM.
Filed under
feature,
HighLights
.
You can follow any responses to this entry through the RSS 2.0