మేమొస్తే లాభాల 'పంటే'!
పేదరిక నిర్మూలనే జీవితాశయమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రైతుపోరు బాటలో భాగంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గురువారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసమే టిడిపి పురుడు పోసుకుందని, పేదరికాన్ని పారద్రోలడమే తన లక్ష్యమన్నారు. రైతుల సమస్యలనే జాతీయ ఎజెండాగా చేసుకొని ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేవరకూ ఉద్యమిస్తానని సభాముఖంగా ప్రతినబునారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. సోనియా ప్రమేయంతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అవినీతి కుంభకోణాలు జరిగాయని, లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. రైతాంగ సంక్షేమం కోసమే పోరాడుతున్నానేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. టిడిపి తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తానని హామీనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరించినా తాము అండగా నిలబడి పాలకుల మెడలు వంచైనా సమస్యలు పరిష్కారిస్తామని, అందువల్ల రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యవసాయమంటేనే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆవేదనలో ఉంటే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. పోరుబాటను ఉద్ధృతం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తానన్నారు.
బాబు సభలో తెలంగాణ లొల్లి రైతుపోరుబాట బహిరంగసభలో తెలంగాణవాదుల గలాటా చోటుచేసుకుంది. పంటపొలాల పరిశీలన సజావుగా ముగిసినప్పటికీ బహిరంగసభకు మాత్రం తెలంగాణసెగ తగిలినట్లయింది. తెలంగాణవాదులు ప్లకార్డులు చేతబూని సభాప్రాంగణంలో ‘ఆంధ్రాబాబు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పటికీ అధినేత సభాప్రాంగణానికి చేరుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకారులపై తిరగబడ్డారు. అంతలోనే పోలీసులు జోక్యంచేసుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు న్యాయవాదులు ప్రాంగణం బయట ప్లకార్డులతో నిరసన తెలిపారు