మనీలాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణ
సిబిఐ కేసులతో సతమతమవుతున్న కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇడి) విచారణ మరింత ఇబ్బందికరంగా మారనుంది. సిబిఐ అధికారులు వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు, ఎమ్మార్ కంపెనీలపై విడివిడిగా కేసులు నమోదు చేసి విచారణ చేస్తుండగా, గాలి జనార్దన్‌రెడ్డి ఒఎంసి అక్రమ మైనింగ్ తవ్వకాలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇటీవలే సిబిఐ విచారణకు జగన్ స్వయంగా హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఇడి తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఫెరా నిబంధనల ఉల్లంఘించారంటూ నమోదైనట్లు తెలిసింది. జగన్ తరఫున హాజరయ్యే ప్రతినిధులు ఎవరైనా పూర్తి సమాచారంతో రావాలని, అవసరమైన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. కానీ స్ధానిక ఇడి వర్గాలు మాత్రం జగన్‌ను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడాన్ని ధ్రువీకరించడం లేదు.
