'జగతి' విలువ పెంచాలని విజయసాయిరెడ్డి ఒత్తిడి
జగతి పబ్లికేషన్స్ విలువను వాస్తవ విలువ కంటే పెంచి చూపాలని ఆ సంస్థ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి తమపై ఒత్తిడి చేసినట్లు డెలాయిట్ ఆడింగ్ సంస్థ సిబిఐకి వెల్లడించినట్లు తెలిసింది. జగతిలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను ఆకర్షించడం కోసమే విజయసాయిరెడ్డి ఈ పని చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా పాత తేదీలతో ఆడిట్ రిపోర్టును కోరారని డెలాయిట్ తెలిపినట్లు సమాచారం. జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ మంత్రి శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయడం, స్పందించిన కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం తెలిసిందే. కొంత కాలంగా జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ మందగించింది. కాంగ్రెస్, జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కేసు విచారణ నత్తనడకన సాగుతోందని టిడిపి నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో బుధవారం నుండి జగన్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తును సిబిఐ ముమ్మరం చేసింది. జగతి పబ్లికేషన్స్ ఆస్తులు, ఆదాయాలపై ఆడిట్ చేసిన సుప్రసిద్ధ సంస్థ డెలాయిట్ సీనియర్ డైరెక్టర్ సుదర్శన్‌ను సిబిఐ అధికారులు దిల్‌కుశ అతిథి గృహానికి పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. సుదర్శన్ వాంగ్మూలంతో కేసులో కొత్త కోణాలు బయట పడ్డాయి. తన తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ అక్రమ ఆస్తులు కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. రాజశేఖరరెడ్డి హయాంలో కొంత మందికి ప్రభుత్వం నుండి లబ్ధి చేకూర్చారని, ఆ విధంగా ప్రయోజనం పొందిన వారు జగన్ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రుణం తీర్చుకున్నారని ఆరోపణ. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన దాదాపు యాభై మంది ఇన్వెస్టర్లను సిబిఐ విచారించింది. జగతి సహా జగన్ సంస్థలు లాభదాయకంగా ఉన్నందువల్లనే వాటిలో పెట్టుబడులు పెట్టామని ఇన్వెస్టర్లు వివరించారు. ప్రసిద్ధ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ అంచనాలను నమ్మి తాము పెట్టుబడులు పెట్టామన్నారు. దీంతో డెలాయిట్‌కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ సుదర్శన్ బుధవారం సిబిఐ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలంతో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. జగన్‌కు సంబంధించిన పలు సంస్థల్లో కీలక వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్‌కు వైస్ ఛైర్మన్‌గా వ్యవ హరిస్తున్నారు. జగతి వాస్తవ విలువను ఎక్కువ చేసి చూపాలని డెలాయిట్‌పై ఆయన ఒత్తిడి తెచ్చారు. 2008లో విజయసాయిరెడ్డి డెలాయిట్ వద్దకెళ్లి రూ.2,500 కోట్ల వాస్తవ విలువ ఉన్న జగతి విలువను మూడు వేల కోట్లకు పెంచాలన్నారు. అంతే కాకుండా 2007 చివరికి ఆ విలువ ఉన్నట్లు పాత తేదీ వేసి ఇవ్వాలన్నారు. జగతి విలువను ఎక్కువ చేసి చూపడం ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించాలని విజయసాయిరెడ్డి ప్రయత్నించారని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది. కాగా ఇప్పటికే జగన్ కేసులో విజయసాయిరెడ్డిని పలుమార్లు సిబిఐ అధికారులు విచారించారు. డెలాయిట్ వాంగ్మూలం నేపథ్యంలో మరోసారి ఆయన్ని విచారించనున్నట్లు తెలిసింది. త్వరలో విజయసాయిరెడ్డికి సిబిఐ నోటీసులు పంపనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే డెలాయిట్ డైరెక్టర్ వాంగ్మూలంపై సిబిఐ అధికారులు పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన సంస్థలు జగన్ సంస్థల్లో ఆడిట్ అంచనాలను చూసి పెట్టుబడులు పెట్టబోవని, 'రుణం' తీర్చుకునే సంస్థలు తమ పెట్టుబడులపై లాభాలు ఆశించబోవని అంటున్నారు. అందుకే డెలాయిట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని పలు విధాలుగా పరిశీలించాల్సి ఉందని సిబిఐ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. జగతి ఆస్తుల విలువను ఎక్కువగా చూపిన డెలాయిట్‌పై సిబిఐ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.