ఇక రెండో ఎస్సార్సీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యపై త్వరలోనే తమ నిర్ణయం ప్రకటిస్తామంటూ కొన్ని రోజుల నుండి ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ)ని తెర ముందుకు తెచ్చింది. ఉత్తరప్రదేశ్ విభజనకు తెలంగాణ సమస్యను జత చేస్తూ చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ను పరిశీలించి తగు సిఫారసులు చేసేందుకు రెండవ ఎస్సార్సీని వేయాలని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుతామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్య రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయటం ద్వారానే పరిష్కారమవుతుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు కూడా ఇది వర్తిస్తుందని రషీద్ ఆల్వీ బుధవారం విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యపై తమ అభిప్రాయాన్ని త్వరలోనే స్పష్టం చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ మంగళవారం పత్రికలకు చెప్పిన వెంటనే ఈరోజు రషీద్ అల్వీ ఈ రోజు ఈ ప్రకటన చేయటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ముఖ్యమంత్రి మాయావతి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయటం తెలిసిందే. మాయావతి డిమాండ్‌ను పరిశీలించేందుకు రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయటం ఒక్కటే దారి అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన గురించి విలేఖరులు అడగ్గా దిగ్విజయ్ ఏం చెప్పారనేది తనకు తెలియదని, అయితే చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్‌ను పరిశీలించేందుకు రెండోఎస్సార్సీని ఏర్పాటు చేయాలని రషీద్ అల్వీ తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమస్యను పరిష్కరించేందుకు రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ఆయన తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌తోపాటు దేశంలోని పలు ఇతర రాష్ట్రాల నుండి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోందని, వీటన్నింటికి కమీషన్ ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు కూడా ఇది వర్తిస్తుందా? అని విలేఖరులు ప్రశ్నించగా తెలంగాణకు ఎలాంటి మినహాయింపు లేదని ఆయన ప్రకటించారు. ‘ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం ప్రజల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదంపై ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి కదా అని ఒక విలేఖరి సూచించగా ‘రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ మాత్రమే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు కాబట్టి మీరీ ప్రశ్న ఆయనకు వేస్తే బాగుంటుంది’ అని అల్వీ స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ఆజాద్ మాత్రమే ఇవ్వగలరని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమస్యను పరిష్కరించేందుకు రెండోఎస్సార్సీని ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని రషీద్ ఆల్వీ పదేపదే ప్రకటించటం గమనార్హం. దేశంలోని పలు ప్రాంతాల నుండి చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉన్నదంటూ చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలా? వద్దా? అనేది కమిషన్ మాత్రమే నిర్ణయించగలగుతుందని స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరుతారని విలేఖరులు ప్రశ్నించగా ‘మా విధానాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాం, రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయవలసింది యుపిఏ సంకీర్ణ ప్రభుత్వమే’నని ఆయన స్పష్టంచేశారు. రెండో ఎస్సార్సీ ఏర్పాటు, తెలంగాణ అంశాలపై తాను చెప్పినదానికి అదనంగా ఏమీ చెప్పదలచుకోలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ విభజన కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్యకు కూడా రెండోఎస్సార్సీ పరిష్కారం సూచిస్తుందన్నారు. ఎస్సార్సీపై ఎవరేమన్నారు.. --- రెండో ఎస్సార్సీ అంటూ దిగ్విజయ్‌సింగ్, రషీద్ అల్వీ వ్యాఖ్యలు నిజమైతే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో సహా మేమంతా పదవులు వదులుకోవడానికి సిద్ధం - కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి --- తెలంగాణ అంశాన్ని ఎస్సార్సీతో ముడి పెట్టవద్దు. ఆజాద్‌కు తప్ప అల్వీకి మాట్లాడేందుకు అధికారం లేదు. - కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ ---- రెండో ఎస్సార్సీ అంటే తెలంగాణలో పార్టీ ఉనికికే ప్రమాదం, కాబట్టి ఇప్పటికైనా అల్వీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి - కాంగ్రెస్ ఎంపి డాక్టర్ మందా జగన్నాధం ---- ఉత్తరప్రదేశ్‌ను ఉద్దేశించే రెండో ఎస్సార్సీ అంటూ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. వాటితో తెలంగాణ అంశానికి సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు ఈ వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. - తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ------ రాష్ట్రాల విభజనకు రెండో ఎస్సార్సీ వేయాలనుకుంటే, తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమవుతుంది. రెండో ఎస్సార్సీ వేయకుండానే దేశంలో 15 రాష్ట్రాలు ఏర్పాడ్డాయి. రెండో ఎస్సార్సీ అనడం తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయడమే - తెరాస ఎమ్మెల్యే టి హరీష్‌రావు ----- కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయడమంటూ జరిగితే, అది కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకున్నట్టు. రెండో ఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ విధానమైతే ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగవడం ఖాయం- తెరాస శాసనసభాపక్షం నాయకుడు -ఈటెల రాజేందర్ ---- ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి చేసిన ప్రతిపాదనపైనే రషీద్ అల్వీ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై దిగ్విజయ్‌సింగ్ స్పందించారు - తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి బి వినోద్‌కుమార్