నెలకు 2 రోజులు పోరాడండి
నెల మొత్తంలో రెండు రోజుల పాటు సమస్యల సాధన కోసం ఉద్యమించాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రైతు పోరుబాట యాత్ర సందర్భంగా బుధవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ఆయన 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తెలంగాణ ప్రాంతంలో మొదటిసారి జరిగిన ఈ యాత్రకు తెలంగాణ వాదుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదు. మరోవైపు తుంబూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భూములను, దుద్దెపూడి, కందుకూరు, మర్లపాడు గ్రామాల్లో నీరులేక ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. ఆయనకు పంట నష్టం వివరాలను వివరంగా చెప్పారు. వెంకన్న అనే రైతు దుద్దెపూడి గ్రామం వద్ద తన పంటపొలంలోని ఎండిన పైరును దగ్ధం చేశారు. దారిపొడవునా రైతులు ఆయనకు సమస్యలను విన్నవిస్తూ వచ్చారు. ఆలస్యంగా యాత్ర ప్రారంభమైనప్పటికీ నిర్ణీత సమయానికే ఆయన బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. రైతులతోనే కలిసి భోజనం చేసిన ఆయన ఆసమయంలో కూడా వారి పరిస్థితులనే అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రైతులంటే తమకేమీ పట్టనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏసీలకు అలవాటుపడిన కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ధరలు పెరగలేదని, లాభసాటిగా వ్యవసాయం మారేంతవరకూ రైతుల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలు మానివేసి పోరాటాలకు సిద్ధం కావాలని, నెలరోజుల్లో 28 రోజుల పాటు వ్యవసాయ పనులు చూసుకొని, మిగిలిన రెండు రోజులు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ వారు చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానన్నారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా నిలబడతానని చెప్పేందుకే ఈయాత్ర చేపట్టానన్నారు. గతంలో కూడా తాను తొమ్మిది రోజులపాటు నిరవధిక దీక్ష చేపట్టానని గుర్తు చేశారు. రైతులంతా పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం ఆలోచించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవగాహనలేని అసమర్థ ప్రభుత్వం కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.