Categories

Popular Posts

Blog Archive

అన్నదాత గుండెకోత..............!


ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రభావాన్ని మన రైతు చవిచూస్తున్నాడు. వీటివల్ల దేశంలో సంపద అనూహ్యంగా పెరిగింది. ఉత్పత్తులు కూడా పెరిగాయి. వాటికి మార్కెటింగ్‌ సౌలభ్యం వృద్ధిచెందింది. అదే సమయంలో ఈ దేశంలో రైతు మాత్రం నీరుగారిపోయాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అప్పులపాలైంది. వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఆదేశాలే. వీటిమేరకు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల్ని తగ్గించింది. అంచెలంచెలుగా మొత్తం తొలగిస్తోంది.
ఇప్పటికే ఎరువుల సబ్సిడీని పూర్తిగా తీసేసింది. కొన్ని రకాల విత్తనాలు, పురుగు మందులపై మాత్రం ఇంకా సబ్సిడీల్ని కొనసాగిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వంటి సందర్భాల్లోనే సబ్సిడీలకు ప్రాధాన్యతనిస్తోంది. మరోవైపు వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ధర పెరిగినా దేశంలో మాత్రం ధరల నిర్ణయాధికారాన్ని ప్రభుత్వమే దఖలుపర్చుకుంది. ఇదే విధానం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలౌతోంది. దేశంలో 82 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే ఆంధ్రప్రదేశ్‌లో 73 శాతం మంది పూర్తిగా ఇదేరంగంపై జీవిస్తున్నారు. వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా భూమే ఉపాధి కల్పిస్తోంది. ఇంతపెద్ద సంఖ్యలో ఉపాధినిస్తున్న రంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రపంచమంతా అన్నదాత సుఖీభవ అంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అన్నదాత దుఖ్ఖానికే పరిమితమయ్యాడు. తరతరాలుగా భూమినే నమ్ముకుని పాడి, పంట అభివృద్ధి చేస్తున్న రైతుల పరిస్థితి ఇక్కడ దయనీయంగా మారింది.
రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులో లేవు. ఇందుకుతగిన యంత్రాల కొనుగోళ్ళకు ప్రభుత్వం సహకరించడంలేదు. ప్రపంచంలో పారిశ్రామికంగా అగ్రగామిగా ఉన్న దేశాలు కూడా వ్యవసాయానికి ఇతోధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆ రంగానికి సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా రైతులకు భద్రత కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఆహార ఉత్పత్తుల పెంపునకు కృషి చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో భారత్‌లో కూడా వ్యవసాయంపైనే పూర్తిగా దృష్టిపెట్టారు. జలవనరులు కల్పించారు. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీలిచ్చారు. సాగును ప్రోత్సహించారు. నెహ్రూ కాలంలో కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి 20 నుంచి 23 శాతం వరకు కేటాయించేవారు. తద్వారా దేశంలో ఆహార ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధ్యమైంది.
కాగా ఇప్పటి పరిస్థితుల్లో రైతు సాగుకు దూరమౌతున్నాడు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతానికి బియ్యం నిల్వలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. గోడౌన్లలో కూడా సరిపడని స్థాయిలో పండేస్తున్నాయి. కానీ రైతు ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మొగ్గుచూపితే 120 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆహార కొరత నెలకొనే ప్రమాదం ఏర్పడుతుంది.
దేశంలో వ్యవసాయం ఇప్పటిది కాదు. క్రీస్తుపూర్వం 9వేల సంవత్సరాల నుంచి భారత్‌లో వ్యవసాయం చేస్తున్న ఆధారాలు లభించాయి. మొక్కల్ని, పశువుల్ని పెంచడం అప్పటి నుంచి ఇక్కడే ప్రారంభమైంది. కావేరి నదిపై ఒకటో శతాబ్దంలోనే భారీ ఆనకట్టను నిర్మించారు. ఇప్పటికీ
ప్రపంచంలో వాడుకలో ఉన్న పురాతన ఆనకట్టల్లో ఇదొకటి. క్రీస్తుపూర్వం 9వేల నుంచే వ్యవసాయంలో భారతీయులు ఆధునిక మెలకువల్ని పాటించడం మొదలెట్టారు. ఏడాదికి రెండు పంటలేసే వారు. ప్రపంచానికే కొత్త వంగడాల్ని పరిచయం చేశారు. అప్పటి నుంచి భారతీయులు మొక్కలు, పశువులు తమ జీవితానికి కీలక ఆధారమని గుర్తించారు. వాటిని ఆరాధించడం కూడా మొదలెట్టారు. గోధుమ, బార్లీలను అప్పటి నుంచి పండించారు. క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్దం నుంచే పత్తిని కూడా పండించడం మొదలెట్టారు. మామిడి, ఖర్బూజలను కూడా ఇక్కడే పండించడం ప్రారంభించారు. బఠానీలు, ఖర్జూరాలను ఇక్కడే పండించారు. దక్షిణాసియా నుంచి తెచ్చి చెరకును పండించడం మొదలెట్టారు. ఉత్తరాదిన గంగానది పరివాహక ప్రాంతంలో క్రీస్తుపూర్వం 4530 నుంచి 5440 మధ్య కాలంలో ధాన్యాన్ని పండించడం మొదలెట్టారు. రబీ, ఖరీఫ్‌ పంటలు కూడా ఆనాడే ప్రారంభమయ్యాయి. మౌర్యుల కాలంలో పెద్దఎత్తున ఆనకట్టలు నిర్మించారు. క్రీస్తుపూర్వం 200 నుంచి కొబ్బరి, బీన్స్‌, చింతకాయల ఉత్పత్తుల్ని కూడా భారతీయులే మొదలెట్టారు. అప్పటికింకా ప్రపంచంలో హరప్పా, మొహంజోదారో ప్రాంతాల్లో మినహా మరెక్కడా పెద్దఎత్తున ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. భారతీయులే రోమన్‌ మార్కెట్లకు ఆహారధాన్యాల్ని ఎగుమతి చేసేవారు. సుగంధ ద్రవ్యాల్ని కూడా విక్రయించేవారు. గుప్తులు, చోళరాజుల కాలంలో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. క్రీస్తుశకం 1200వ సంవత్సరం తర్వాత అరబిక్‌, పర్షియన్‌ తరహాలో భారత్‌లో ఆనకట్టల నిర్మాణం సాగింది. ఇది వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. దేశంలో గోధుమ, వరి ఉత్పత్తి ప్రాంతాల్ని వేర్వేరుగా విభజించారు. మధ్య, ఉత్తర భారతాల్లో గోధుమ ఉత్పత్తి పెరిగింది. గుజరాత్‌ నుంచి దక్షిణ ప్రాంతాల్లో వరి ఉత్పత్తులు వృద్ధియ్యాయి. బ్రిటీషీయుల కాలంలో సట్లైజ్‌ వ్యాలీ అభివృద్ధి చెందింది. అనేక వాణిజ్యపంటల ఉత్పత్తి పెరిగింది.
1950లోనే నెహ్రూ మోర్‌ ఫుడ్‌ కేంపేయిన్‌ ప్రారంభించారు. వ్యవసాయానికి పెద్దఎత్తున రాయితీలు ప్రకటించారు. వ్యవసాయ విప్లవమంటూ నినాదాలిచ్చారు. 1986... 90ల మధ్య ప్రభుత్వాలు నూనె గింజల ఉత్పత్తికి ప్రాధాన్యతనిచ్చారు. 1970... 96ల మధ్య డైయిరీ ఉత్పత్తులకు, 1973... 2002 మధ్య సముద్ర ఉత్పత్తులకు రాయితీలిచ్చారు. 1991లో ఆర్థిక సరళీకరణల అనంతరం బయో టెక్నాలజీ రంగాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచే రాయితీల్ని తగ్గించేశారు. ఇప్పటికీ ప్రపంచంలో పాలు, పళ్ళు, కొబ్బరి, అల్లం, జీడిపప్పు, చింతపండు, అరటిపండు, సపోట, పప్పు ధాన్యాల ఉత్పత్తుల్లో భారత్‌ అగ్రగామిగా ఉంది. వేరుశనగ, గోధుమ, కూరగాయలు, పంచదార, చేపల ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉంది. పొగాకు, ధాన్యం ఉత్పత్తిలో మూడో స్థానంలోనూ, వాణిజ్య పంటల ఉత్పత్తిలో నాలుగో స్థానంలో, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఐదో స్థానం, మాసం ఉత్పత్తిలో ఏడో స్థానంలో నిలిచింది. జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం 32 శాతం భాగస్వామ్యం పొందుతోంది. ఏటేటా కనీసం అరశాతం పెంచుకుంటూ పోతోంది. అయినప్పటికీ వ్యవసాయాన్ని భారత ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించడం లేదు. దీంతో వాణిజ్య బ్యాంకుల నుంచి ఈ రంగానికి రుణాలు అందడంలేదు. ఓ వైపు రాయితీలు తగ్గడం, మరోవైపు ఉత్పాదక వ్యయం పెరగడంతో రైతులు నష్టాలపాలౌతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాయి. సాధారణ పరిశ్రమలకంటే వ్యవసాయానికి ఎక్కువ రాయితీలిస్తున్నాయి. తద్వారా ఆహారోత్పత్తుల్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వాటిని విక్రయిస్తున్నాయి. విదేశీ మారకద్రవ్యాల్ని పొందడంతో పాటు దేశ ప్రజల అవసరాలకు సరసమైన ధరల్లో వాటిని అందుబాటులో పెడుతున్నాయి. 2010లో యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయాభివృద్ధికి 57 బిలియన్‌ పౌండ్లు వ్యయం చేసింది. ఇందులో 39 బిలియన్‌లను రైతులకు నేరుగా సబ్సిడీల రూపంలో చెల్లించింది. యూరోపియన్‌ యూనియన్‌ బడ్జెట్‌లో 40 శాతాన్ని వ్యవసాయం, చేపల పరిశ్రమలకు రాయితీలుగా కేటాయిస్తోంది. 2005 నుంచి కామన్‌ అగ్రికల్చర్‌ పాలసీని ప్రకటించిన యూరోపియన్‌ యూనియన్‌ అంతవరకు ఉన్న సబ్సిడీని ఒకేసారి రెట్టింపు చేసింది. అమెరికా అగ్రికల్చర్‌ పాలసీ ఆఫ్‌ ద యుఎస్‌, ఫుడ్‌ కన్జర్వేషన్‌ అండ్‌ ఎనర్జీయాక్ట్‌ ఆఫ్‌ 2008ను అత్యంత పటిష్టంగా అమలు చేస్తోంది. ఏటా 20 బిలియన్‌ డాలర్లను రైతులకు ప్రత్యక్ష సబ్సిడీలుగా చెల్లిస్తోంది. యుఎస్‌ ఫామ్‌ బిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బిల్‌ ద్వారా రైతు ఉత్పాదక వ్యయానికి, మార్కెట్‌లో లభిస్తున్న ధరకి మధ్యగల వ్యత్యాసాన్ని రాయితీల రూపంలో నేరుగా అందిస్తోంది.
ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో రైతు పొందే ప్రతి డాలర్‌లోను 62సెంట్లు ప్రభుత్వ సబ్సిడీ రూపంలో లభిస్తున్నదే. 2010... 11లో యుఎస్‌లో అన్నిరకాల సబ్సిడీలు కలిపి 280.8 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కారణంగా యుఎస్‌లో వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోంది. 1930లతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు రైతులు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఇతర రంగాల్తో పోలిస్తే అక్కడిప్పుడు రైతులే ఎక్కువగా రాయితీల ద్వారా లాభపడుతున్నారు. లోవా రాష్ట్రంలో 2003... 05ల మధ్యలో లబ్ధిదారుల్లో ఒక శాతం సబ్సిడీల్లో 17శాతాన్ని కైవసం చేసుకున్నారు. టెక్సాస్‌లో 18 శాతం మంది ప్రజలు వ్యవసాయ రాయితీలు పొందుతున్నారు. ఆహారోత్పత్తులు, జొన్న, పత్తి, వరి, గోధుమ, సోయా, డైయిరీ ఉత్పత్తులు, ఆయిల్‌ సీడ్స్‌, చెరకు, పొగాకు, కూరగాయలు, తేనె ఇలా అన్ని వ్యవసాయోత్పత్తులపై కూడా అమెరికాలో రాయితీలిస్తున్నారు. అత్యధిక ఆదాయమున్న దేశాల గ్రూప్‌ (ఒఇసిడి) సభ్యులు మొత్తం ఆదాయంలో 31శాతం ఆహార, వ్యవసాయ సబ్సిడీలుగానే చెల్లిస్తున్నారు. కొరియా, జపాన్‌ ప్రభుత్వాలు వరిపై ఉత్పత్తి వ్యయంలో 65 శాతాన్ని సబ్సిడీగా రైతులకిస్తున్నాయి. ఐస్‌లాండ్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌లు వరి ఉత్పత్తి వ్యయంలో 65 నుంచి 75 శాతం సబ్సిడీలుగా చెల్లిస్తున్నాయి. ఒక్క ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు మాత్రమే 4శాతం కంటే తక్కువ సబ్సిడీలిస్తున్నాయి.
కాగా, భారత్‌లో కూడా సబ్సిడీలున్నాయి. అయితే ఇవి వ్యాపార సంస్థలు, పరిశ్రమలకే ఎక్కువగా లభిస్తున్నాయి. ఇంటర్‌నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ ప్రచురించిన ఒక కథాంశం మేరకు భారత్‌ జాతీయాదాయంలో 14శాతం సబ్సిడీలుగా పోతోంది. ఇందులో ఎక్కువగా పెట్రోలియం, గ్యాస్‌ ఉత్పత్తులకే కేటాయిస్తున్నారు. ఆ తర్వాత విద్యుత్‌ రంగాలకు రాయితీలిస్తున్నారు. ఇందులో కూడా ఎక్కువగా దుర్వినియోగమౌతున్నాయి. సబ్సిడీ కిరోసిన్‌లో 39 శాతం పక్కదారి పడుతున్నట్లు ట్రిబ్యూన్‌ పత్రిక పేర్కొంది. యునెస్కో అధ్యయనం మేరకు భారత్‌ విద్యా, వ్యవసాయరంగాలపై అతితక్కువ సబ్సిడీలిస్తోంది.
భారత్‌లోని కొన్ని రాష్ట్రాలిప్పుడిప్పుడే మేల్కొంటున్నాయి. కర్నాటక గత కొంతకాలంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. కేంద్రానితో సంబంధం లేకుండా వ్యవసాయరంగానికి రాయితీలిస్తోంది. నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రయ్యాక బీహార్‌లో కూడా వ్వవసాయ బడ్జెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిగా కేంద్రంపై ఆధారపడకుండా రాష్ట్రాలు తమ పరిధిలోనైనా వ్యవసాయ, ఆహార రంగాలకు సబ్సిడీలు కొనసాగిస్తే తప్ప రాష్ట్ర రైతాంగం వ్యవసాయ రంగంలో కొనసాగే పరిస్థితుల్లేవు. రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట వేల కోట్లు వ్యయం చేసినా అదనంగా సాగునీటి లభ్యత చేకూరలేదు. వ్యవసాయ పథకాలన్నీ ప్రచారానికే పరిమితమౌతున్నాయి. వీటివల్ల రైతుకు ఒనగూరుతున్నదేమీలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి నుంచే బడ్జెట్‌ రూపకల్పన సాగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి వ్యవసాయ బడ్జెట్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా సరే రైతాంగానికి అదనపు రాయితీలు సాధించాలి. కనీసం రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌పెట్టి ఆ రంగానికి అదనంగా నిధులివ్వాలి. కేంద్రంతో సంబంధం లేకుండాఉత్పత్తి వ్యయంలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించాలి. అప్పుడే రైతు మనుగడ కొనసాగుతుంది. వ్యవసాయ లాభసాటి అవుతుంది

Posted by mahaandhra on 7:35 PM. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0

0 comments for అన్నదాత గుండెకోత..............!

Leave comment

Photo Gallery