భాను కిరణ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో గాలింపు
మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కోసం పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా గాలిస్తున్నారు. భాను కిరణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో సంచరిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందని డిజిపి దినేష్ రెడ్డి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. పోలీసు ప్రత్యేక బృందాలు భాను కోసం గాలిస్తున్నాయి. నర్సాపురం, భీమవరం ప్రాంతాల్లో భాను సంచరిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.భాను కిరణ్ మూడు నెలల క్రితం కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినట్లు, కొన్ని సెటిల్‌మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో కూడా భాను కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానంగా సంచరిస్తున్నవారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మద్దెలచెర్వు సూరి హత్య జరిగింది. అప్పటి నుంచి భాను కిరణ్ పరారీలో ఉన్నాడు. అతని జాడ కోసం పోలీసులు అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు.




